వీర సావర్కార్
(28-05-1883...26-02-1966)
1910 సం జులై 10 వ తేది, సూర్యోదయం అవుతున్న సమయం. ఫ్రాన్స్ లో మార్సేల్స్ రేవుపట్నం లో మొరియో అనే ఓడ లంగరు వేసుకొని నిలబడి ఉంది. దానిలో ఏదో యాంత్రిక లోపం ఏర్పడింది. ఓడ సిబ్భంది ఆ లోపాన్ని సరిదిద్దే హడావిడిలో ఉన్నారు. సముద్రం ప్రశాంతంగా ఉంది, ప్రయాణికులు ప్రశాంతంగా ఉన్నారు, అయితే ఈ వాతావరణం లో ఇమడకుండా ఒక యువకుడు ఏవేవో లెక్కలు వేసుకుంటున్నాడు. నిశ్చింతగా ఉండటం అతనికి సాధ్యం కాదు ఎందుకంటే అతడు బందీగా ఉన్నాడు అది కూడా ఆంగ్ల ప్రభుత్వానికి... అతడి పైన రాజద్రోహం నేరం మోపబడి ఉంది. అతని కదలికలను అనుక్షణం కనిపెడుతూ ఇద్దరు పోలీసులు కాపలా కాస్తున్నారు కూడా. 'నేను బయటకు వెళ్ళాలి' అన్నాడు బందీ, ఒక పొలిసు అతనిని మరుగుదొడ్డి దగ్గరకు తీసుకు వెళ్ళాడు. బందీ లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాడు, బయట ఇద్దరు పోలీసులు కాపలా కాస్తున్నారు, మరుగుదొడ్డి గుమ్మానికి పైన అద్దాల కిటికీ ద్వారా లోపల ఉన్న బందీ కదలికలు పసిగట్టచ్చు. లోపలకు వెళ్ళిన బందీ తన కోటు విప్పి అద్దానికి అడ్డంగా తగిలిచ్చాడు. మరుక్షణం ఉహించలేని విధంగా మరుగుదొడ్డి రంధ్రం నుండి సముద్రం లో కి జారిపోయాడు. కెరటాలతో పోరాటం చేస్తూ ఒడ్డుకు ఈదుకుంటూ పారి పోయాడు. "పారి పోతున్న బందీ పేరు సావర్కర్".
1883 వ సం మే 28 న మాహారాష్ట్ర లోని నాసిక్ లో దామోదర్ పంత్, రాధాబాయి దంపతులకు వినాయక దామోదర్ సావర్కర్ జన్మించాడు. అప్పటికే వారికి గణేష్ దామోదర్ సావర్కర్ అని అబ్బాయి ఉన్నాడు. సమాన అర్ధం వచ్చే పేర్లు గల ఈ అన్నదమ్ములిద్దరూ దేశ కార్యాలలో కూడా సమానంగా పాల్గొని తమకు సమాన పేర్లు పెట్టడానికి సార్ధకత కల్పించారు.
"మిత్ర మేళ" అనే సంస్థ ను స్థాపించి దానిద్వారా వ్యాయామశాల, గణేష్ పూజ, శివాజీ జయంతి లాంటి సార్వజనిక ఉత్సవాలు నిర్వహిస్తూ అందరిని చైతన్యవంతుల్ని చేస్తూ చిన్నతనంనుంచే స్వాతంత్ర్యం కోసం పాటుపడ్డారు. దేశ స్వాతంత్ర్యం కోసం సాయుధ పోరాటమే సరైన మార్గమని తలచిన సావర్కర్ "అభినవ భారత్" అనే సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నాడు. లండన్ లో న్యాయ శాస్త్రం చదివిన సావర్కర్ అక్కడ చదువుతున్న సమయంలో కూడా "ఇండియా హౌస్" అనే సంస్థ ద్వారా స్వాతంత్ర్య కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. లండన్ నుంచే 1857 ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం గురించి పుస్తకం వ్రాసిన సావర్కర్ ఆ పుస్తకాన్ని ఇండియా లోని తన అన్నకి పంపించాడు. అయితే ఆ విషయం తెలిసిన ఆంగ్ల ప్రభుత్వం గణేష్ సావర్కర్ ను బంధించి జీవిత ఖైదు విధించింది. మదన్లాల్ ధింగ్ర లాంటి సావర్కర్ స్నేహితులు పోరాటం లో మరణించారు. అయితే ఇక లండన్ లో ఉండటం ఇష్టం లేక తిరిగి భారత్ వచ్చే ప్రయత్నం లో సావర్కర్ ఆంగ్లేయులకు దొరికిపోయాడు. బ్రిటిష్ ప్రభుత్వం సావర్కర్ కి మునుపెన్నడూ లేని రీతిలో 2 రెట్లు జీవిత ఖైదు శిక్ష గ విధించింది. ఒక జీవిత ఖైదు అంటేనే 25 సం ల కటిన కారాగారం, అలాంటిది 50 సం లు శిక్ష విధించినది బ్రిటిష్ ప్రభుత్వం. అయితే 1922 లో సావర్కర్ ని విడుదల చేసి గృహనిర్భందం చేసింది. 13 సం లు గృహనిర్భందం లో మ్రగ్గిన సావర్కర్ ఆ తర్వాత కూడా ఎన్నో శిక్షలకు గురయ్యాడు . 1948 లో గాంధీ హత్య కేసు లో విచారణకు గురి అయిన సావర్కర్ నిరపరధిగా నిరుపించాబడ్డాడు.
1964 సం లో భారత ప్రభుత్వం సావర్కర్ కు "అప్రతిహతీ స్వతంత్ర్యవీర" అనే బిరుదును ప్రదానం చేసింది. భారత్ పాకిస్తాన్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన సావర్కార్ 1966 సం ఫిబ్రవరి 26 న మృతిచెందారు.
అంతవరకూ కేవలం సిపాయీల తిరుగుబాటుగా పిలువబడిన 1857 లో జరిగిన సైనికుల పోరాటాన్ని ప్రథమ స్వతంత్ర సంగ్రామం అని పిలిచింది సావర్కరే!! '1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామము' అనే తన గ్రంధం లో (1907)ఈ చరిత్ర ను వ్రాశారు. ఇటలీ దేశానికి చెందిన మహా దేశ భక్తుడు మాజినీ జీవిత చరిత్రను 1906 లో వ్రాశారు! బాల్యంనుండే అనేక కవితలు గేయాలు దేశ భక్తిని పెంపొందించడానికి వ్రాశారు! అండమాన్ జైలులో హిందూ ముస్లిం ఖైదీలను ఏకం చేశారు. అంటరాని తనాన్ని నిర్మూలించడానికి సహపంక్తి భోజనాలను ప్రారంభించారు. అండమాన్ జైలు గోడల ను కాగితాలుగా చేసుకొని ఎన్నో గేయాలను, పద్యాలను, 'కమల గోమంతక్', 'మహా సాగర్' అనే కావ్యాలను రచించారు. అంటరానితనాన్ని నిరసించి నిమ్న వర్గాల వారిని దేవాలయలలోకి రానివ్వని దురాచారాన్ని ఖండించి , పూణే సమీపంలో 'రత్నగిరి' లో విఠలుని మందిరం నిర్మించి, దానికి పతిత పావన మందిరం అని పేరు బెట్టి, శంకరాచార్యులచే ఆ దేవాలయాన్ని ప్రారంభింప జేశారు. అండమాన్ జైలులో వారిని ఉంచిన గదిని జాతీయ స్మారక చిహ్నంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. 'కాలా పానీ' అనే హిందీ/తమిళ సినిమాలో ఈ అండమాన్ జైలు గురించే చూపించారు! చివరి రోజులలో కూడా 'భారత దేశ చరిత్రలో ఆరు స్వర్ణ పుటలు' అనే గ్రంధాన్ని రచించారు. కుల, మత, వర్ణ విచక్షణ లేని అఖండ భారతాన్ని గురించి కలలు కన్నారు. భారత విభజనను తీవ్రంగా వ్యతిరేకించి, ఎంతో విచారించారు విభజనకు! ఏ దేవుడినీ, దేవతలనూ ఆరాధించ వలసిన అవసరం వున్నా, లేకున్నా, దేశమాతనే దేవతగా ఆరాధించాలని ప్రబోధించారు! గాయత్రీ మంత్రం బదులుగా..నిత్యమూ స్వతంత్ర భారతీ భగవతి ని ఆరాధించే వారు! '' జయోస్తు తే శ్రీ మహన్మంగళే శివాస్పదే శుభదే..స్వతంత్ర తే భగవతి! త్వామహం యశో యుతాం వందే!'' అనేదే ఆ గాయత్రీ మంత్రం! ఎనభై ఆరు సంవత్సరాల పూర్ణ జీవితం అనుభవించి, అపర భీష్మాచార్యుల వారి వలె..ఆహార పానీయాలను తగ్గించి..ఆహారం పూర్తిగా చివరిలో మానేసి..స్వచ్చంద మరణాన్ని పొందారు!
మన మహనీయులు అనే బ్లాగు ద్వారా దేశభక్తుల గురించి తెలియజేస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete