Thursday, August 23, 2012

నాద బ్రహ్మ-శ్రీ త్యాగరాజ స్వామి

         



           ''ఎందరో మహానుభావులు..అందరికీ వందనములు..' అనే పల్లవిని వినని, ఒక్కసారైనా సరదాగానైనా ఆ మాట అనని తెలుగువాడు వుండడు. శాస్త్రీయ సంగీత బాణీలోని ఒక కీర్తనలోని పల్లవిని జన బాహుళ్యం లోకి, ప్రజల హృదయాలలోకి ఒక సత్యాన్ని పలకడం ద్వారా తీసుకెళ్ళిన మహానుభావుడు నాదబ్రహ్మ గా కొనియాడబడిన త్యాగరాజస్వామి వారు!

           కర్ణాటక సంగీతంగా పిలువబడే దక్షిణ భారతదేశ శాస్త్రీయ సంగీత విధానానికి ఆద్యుడు పురందర దాసు అంటారు..కానీ త్యాగరాజస్వామి కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి పితామహుడిగా గుర్తింపబడ్డారు.క్రీ.శ .04 -05 -1767 నాడు త్యాగరాజస్వామి వారు జన్మించారు, పురందర దాసు అంతకు 200 సంవత్సరాల క్రితం వారు.త్యాగరాజు,శ్యామ శాస్త్రి,ముత్తుస్వామి దీక్షితార్..ఈ ముగ్గురినీ కర్ణాటక సంగీత వాగ్గేయకార త్రయం అంటారు.వీరిలో త్యాగరాజస్వామి వారి పేరు పండిత పామరులకు అందరికీ తెలిసిన పేరు. త్యాగరాజస్వామి వారి పూర్వీకులు ఆంధ్రులే.కర్నూల్ జిల్లాలోని కాకర్ల గ్రామంనుండి తమిళనాడు లోని తంజావూరు దగ్గిరి తిరువారూరుకు వలస వెళ్ళారు, ఆయన ముత్తాత పంచనాద బ్రహ్మ గారి హయాములో.వారి కుమారుడు, త్యాగ రాజస్వామి వారి తాత ఐన గిరి రాజ బ్రహ్మ గొప్ప కవి, పండితుడు, తంజావూరు రాజాస్థానంలో సన్మానం పొందిన వారు. ఆయన కుమారుడు రామబ్రహ్మ, త్యాగరాజ స్వామి వారి తండ్రిగారు, గొప్ప పండితుడే కాక మహా రామ భక్తుడు, ఆయన ఇంట్లో నిత్యమూ రామ పంచాయతన పూజ చేసే వారు. ఆయన ధర్మ పత్ని, త్యాగరాజస్వామి వారి తల్లి సీతమ్మ కూడా రామభక్తురాలు. తంజావూరు రాజు తుల్జాజీ మహారాజు నిత్యమూ రామబ్రహ్మ గారిచేత రామాయణం వినిపించుకునే వారు. అటువంటి పరమ భక్తుల ఇంట పుట్టిన త్యాగరాజస్వామివారు శ్రీ రామ సాక్షాత్కారం పొందిన సాధకుడు.త్యాగరాజస్వామి వారికి ఇద్దరు అన్నలు.పంచనాద బ్రహ్మ,పంచాప కేశ బ్రహ్మ. పంచాపకేశ బ్రహ్మ యవ్వనంలోనే మరణించాడు.పెద్ద కుమారులు ఇద్దరూ చెడు అలవాట్లకు లోనై అపఖ్యాతి తెస్తే, ఆవేదనకు గురైన రామబ్రహ్మ తిరువారూరు లోని శివుడు త్యాగరాజ స్వామికి మొక్కుంటే పుట్టాడు కనుక మూడవ కుమారుడికి త్యాగరాజస్వామి అని పేరు పెట్టారు. ఆ తర్వాత కొంత కాలానికి రామబ్రహ్మ సమీపంలోని తిరువాయూర్ కి వెళ్లి నివాసం ఏర్పరచుకున్నారు.

         ఐదు నదులు కావేరి,కొలరూన్,కోడమూరుతి,పెన్నార్,వేట్టార్..చట్టు ముట్టి ప్రవహిస్తున్న పుణ్యక్షేత్రం తిరువాయూర్.అక్కడి సంస్కృత పాఠశాలలోనూ, అక్కడి మహా విద్వాంసులు శోంఠి వేంకట రమణయ్య పంతుల వారి వద్ద సంగీత విద్యలోనూ అభ్యాసం చేశారు త్యాగరాజస్వామి వారు.ఆ రోజుల్లోనే రామక్రిష్ణానంద స్వామి అనే యోగి ఈయనకు రామతారకమును ఉపదేశించారు, ఆ తర్వాత నారదోవాస్తి అనే మంత్రం ఉపదేశించారు, స్వరార్ణవం అనే మహత్తర సంగీత కళా రహస్య నిధి ఐన పుస్తకాన్ని ఇచ్చారు. ఆయన నారద మహర్షి అవతారం అని త్యాగరాజ స్వామి వారి నమ్మకం. ఇంట్లో నిత్యమూ తల్లిదండ్రుల కు సహాయంగా రామసేవా కార్యక్రమం లో మగ్నులై సంగీత విద్వాంసురాలైన తల్లి అన్నమయ్య కీర్తనలను, భద్రాచల రామదాసు కీర్తనలను, క్షేత్రయ్య పదాలనూ పాడుతుంటే ఒకరోజు తను ఆశువుగా ''నమో నమో రాఘవాయ '' అనే కీర్తనను దేశి తోడి రాగం లో పాడి ఆనాటినుండి మొదలుకొని, 24000 కీర్తనలను రచించారని ప్రతీతి, కానీ ఇప్పుడు అన్నీ లభ్యములు కావు.తండ్రి మరణంతో,తల్లీ,తనూ, భార్యతో సామాన్య జీవనం కొనసాగిస్తున్న త్యాగరాజస్వామి వారు నిత్యం కావేరి తీరంలో శ్రీరామ షడక్షరీ మంత్ర జపం ఒక లక్షా ఇరవై ఐదు వేల సార్లు చేశే వారు, తర్వాత ఆ నది తీరంలో తన కీర్తనలు పాడుకుంటుంటే గ్రామ ప్రజలు వింటూ ఆనందించే వారు, ఇంట్లో నిత్య అర్చన, అనంతరం వాల్మీకి రామాయణం, పోతన భాగవత పారాయణం,పురందరదాసు కీర్తనలను పాడుకోవడం ఇవీ వారి దినచర్యలో భాగాలు.

              తంజావూర్ మహారాజు, మహారాజు స్వాతి తిరునాల్ వంటి రాజులూ, ఎందరో సంపన్నులు ఎన్ని రకాలుగా ఆహ్వానించినా ఏ నాడూ రాజాశ్రయం కొరకు యాచించని మహానుభావుడు. గణిత, జ్యోతిష, సంగీత విద్య విశారదుడు, మహా రామ భక్తుడు,సంప్రదాయం ప్రకారం నారద మహర్షి అవతారం, వాల్మీకి అవతారం త్యాగరాజస్వామి వారు. మొదటి భార్య పార్వతి కాలవశాత్తూ మరణించిన తర్వాత తన తల్లి బలవంతం మీద జీవిక కొనసాగించడానికి, గృహస్థ ధర్మాన్ని కొనసాగించడం కొరకు తన భార్య చెల్లెలు కమలమ్మను వివాహం చేసుకొని, ఒక కుమార్తెను కని, అమెకి 'సీతా మహాలక్ష్మి' అని పేరు పెట్టుకున్నారు!నిత్యం వీధులలో తన గాన రసప్రవాహం పారిస్తూ, యాచక వృత్తిలో వచ్చిన దానిలో తన కుటుంబాన్ని వెళ్ళదీసి , శిష్యులకూ భోజనం పెట్టి సంగీతం నేర్పారు!

          ఎందరు రాజులూ, చక్రవర్తులు ఆహ్వానించినా ఏ నాడూ గ్రామం దాటి వెళ్ళక, కంచి కామకోటి పీఠం ఆచార్యులవారు తాము కదలలేని స్థితిలో ఈయనను చూడాలనుకుంటున్నారు అని తెలిసి కంచి వెళ్లి దారి పొడవునా ఎందరో శిష్యుల, ప్రశిష్యుల అతిధిగా తమిళనాట తమ సంగీత గంగను పొంగించి, కంచిలో కొన్ని రోజుల బస తర్వాత తిరిగి వస్తూ తిరువక్తియూరు లో వీణా కుప్పయ్యర్ అనే ఒక శిష్యుని ఇంట బస చేసి, ఆ వూరి సంపన్నుడు ఒకడు ఈయన మీద భక్తితో కానుకలు ఇస్తే, ఆ శిష్యుడు ఈయనకు తెలియకుండా ఇతర శిష్యులకు బంగరునాణాల సంచిని ఇస్తే వారు పల్లకీలో దాచారు. తిరుగు మార్గంలో అడవిగుండా పల్లకీ వెళ్తున్నప్పుడు బందిపోట్లు దోచుకోవడానికి వస్తే మనదగ్గిర ఏముంది కనుక భయం అన్నారు త్యాగరాజస్వామి వారు.శిష్యులు అప్పుడు బంగరు నాణాల సంగతి చెప్పి, రామ సేవలో లోటు రాకుండా వుండడం కోసమని ఇస్తే తీసుకున్నామని చెప్పారు.అయితే రాముని సొమ్మును రాముడే కాపాడుకుంటాడు అని..ఇరుప్రక్కల తోడై రారా..అని కీర్తన పాడుకుంటుంటే రామలక్ష్మణులు ధనుర్ధారులై ఆ దొంగలను భయపెట్టి పారద్రోలారు. మర్నాడు వీరు బస చేసిన దగ్గిరకు ఆ దొంగలు వచ్చి క్రితం రాత్రి తాము చూసిన ఇద్దరు భటులను, వారి అంద చందాలను, వారి చేతులలోని విల్లంబులను, వారి లాఘవాన్ని పొగడుతుంటే, వారికి నమస్కరించి మీరే అదృష్టవంతులు..రామలక్ష్మణులను కళ్ళారా చూశారు అని ఆనంద బాష్పాలు రాల్చారు త్యాగయ్య. దారిలో తిరుపతిలో దర్శనానికి సమయం అయిపోయిందని అర్చకులు తెర వేస్తే, ''తెర తీయగరాదా..తిరుపతి వేంకట రమణ మత్సరమను తెర తీయగ రాదా'' అని కీర్తనను ఆలపిస్తే తెర దానంతట అదే తొలిగిపోయి స్వామి దర్శనం లభించింది త్యాగరాజ స్వామి వారికి. ఇలాంటివే ఎన్నో మహిమలను దర్శింప జేస్తూ ఇంటికి తిరిగివచ్చారు.ఇదొక్కటే ఆయన చేసిన యాత్ర గ్రామాన్ని విడిచి.

             ఈయన అన్న రాజుల ప్రాపకాన్ని వద్దంటున్నాడు అనే కోపంతో ఈయన పూజించుకునే రామ, లక్ష్మణ, భరత, శత్రఘ్న, సీత, హనుమాన్ విగ్రహాలను కావేరిలో వేస్తే కావేరి వొడ్డునే శోకిస్తూ ప్రార్ధిస్తే, విగ్రహాలు వాటంతట అవే పైకి తేలాయి. ఆనందంతో ఉప్పొంగుతూ ''కనుగొంటిని శ్రీ రాముని నేడు'','';రారా మా యింటి దాక''..అని కీర్తనలను పాడుతూ మేళ తాళాలతో విగ్రహాలను ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చి మరలా పూజలు ప్రారంభించారు.. ఈయన అన్నగారికి తమ తప్పుతెలిసి వచ్చి ఆయన కూడా శ్రీ రామ భక్తులైనారు. ఈయనకు కుమారులు లేనందున అన్నగారైన జప్యేషుని కుమారులే ఈయన స్మారక చిహ్నమైన సమాధి వద్ద పూజలు చేస్తున్నారు.. వారి సంతతి వారే ఇప్పటికీ ఆ కార్యక్రమమును నిర్వహిస్తున్నారు.

       రెండవ భార్య కమలమ్మ మరణించిన తర్వాత, తీవ్ర వైరాగ్యానికి బాధకు గురి అయి,తము కూడా వెళ్లి పోవలసిన
సమయం వచ్చిందని తెలిసికొని, పుష్య శుద్ధ ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి రాత్రి పూజ,సంగీత సాధన, భోజనాలు
ఐన తర్వాత, శిష్యులకూ, అందరికీ, పుష్య బహుళ పంచమి నాడు తన ఇంటికి రమ్మని చెప్పి ..పుష్య బహుళ పంచమి నాడు 06 -01 -1847 నాడు పూజ, అర్చన, సంగీత సాధన ఐన తర్వాత , ఆపత్ సన్యాసం స్వీకరించి, శ్రీ రామనామజపం చేస్తూ సమాధిలోకి వెళ్లి, తమ ప్రాణాలను త్యజించారు. అందరి సమక్షంలో ఆయన కపాలం విచ్చుకొని, ఒక దివ్య జ్యోతి శ్రీ రామునిలో కలిసిపోయింది. తిరువయూరులో, అక్కడే ఆయనకు 'బృందావనం', సమాధి నిర్మించారు, ఈ నాడు తమిళనాడు లో ఆది ఒక ప్రసిద్ధ యాత్రా స్థలం.ఈ నాడు ఆయన జయంతి..ఎందరో మహానుభావులు..అందరికీ వందనములు అన్న మహానుభావుని జయంతి ఉత్సవాల రోజుననే యాదృచ్చికంగా 'మన మహనీయులు' గ్రూప్ ప్రారంభింపబడి..ఆయనను గురించిన ఈ పోస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది.

           త్యాగరాజస్వామి వారి కీర్తనలు బహు వేదాంత రహస్యాల సారాలు. ప్రపంచం మొత్తం శ్రీ రామ తత్త్వంతో నిండి వుందని భావించి సర్వత్రా శ్రీ రాముడినే దర్శించిన కారణ జన్ముడు..ఎక్కువగా తెలుగులోనూ,కొన్ని సంస్కృతం లోనూ కీర్తనలను రచించిన సంగీత శాస్త్ర రహస్య కళానిధి ఐన, నారద మహర్షి అవతారం ఐన శ్రీ త్యాగరాజ స్వామి వారి కీర్తనలను సంప్రదాయం ప్రకారమే, ఆయన నిర్దేశించిన రాగ,తాళ పద్ధతులలోనే సభ్యతగా, సంస్కార బద్దంగా ఆలపించడం, అలాగే ఆదరించడం మన కనీస కర్తవ్యం. దురదృష్ట వశాత్తూ తెలుగు సినిమాలలో, ఇతరత్రా ఆయన కీర్తనలను అక్కడక్కడా దుర్వినియోగం చేయడం దురదృష్టకరం. దీనిని నిరసించాల్సిన అవసరం ఉన్నది.'

Source: Manamahaneeyulu-Facebook : https://www.facebook.com/groups/164573576982747/ 

No comments:

Post a Comment