Monday, June 2, 2014

నరేంద్రమోడీ!

నరేంద్రమోడీ!
ఒక కల నిజమయ్యింది. ఒక అడుగు కదిలింది. నవభారత పయనం మొదలయ్యింది. మూర్తీభవించిన నిర్మలత్వం, అందరూ నావారే అనుకునే మనస్తత్వం, ఎవడేమనుకున్నాసరే, తను అనుకున్నదాన్ని సాధించడానికి ఎన్ని అడ్డంకులనైనా అధిగమించే ధీరత్వం, నిందలకు, ఆపదలకు, సవాళ్ళకు వెనుదీయని నిర్భయత్వం కలగలిసి, మూర్తీభవిస్తే మూర్తికి మోడీ అని పేరు!

ఇన్నాళ్ళ ఇన్నేళ్ళ భారత గణతంత్ర చరిత్రలో ప్రజలు దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఊదరగొట్టే ఊసరవెల్లులను చూశాము, ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు అని మూరెడేసి డైలాగులు వల్లించే మూర్ఖులను చూశాము, సాక్షాత్తూ ప్రజాస్వామ్య దేవాలయంలో మైకులను విరిచేవాళ్ళను, మందులు చల్లి మంటలురేపేవాళ్ళను, మహిళల వలువలను లాగే వాళ్ళను చూశాము. దేవాలయంపై దాడి చేసి ప్రాణాలను అపహరించిన ముష్కరులను ఇంటి అల్లుళ్ళను మేపినట్టు మేపిన మేకవన్నె పులులను చూశాము. ఇప్పుడంటే యిప్పుడే దేవాలయం ముందు కనులు చెమ్మగిల్లి, మోకాళ్లమీద మోకరిల్లి, నుదురు తాకించి నమస్కరించిన ఒక సున్నిత హృదయుడిని, ఒక సంస్కారవంతుడిని, ఒక భావుకుడిని, భావిస్వప్నద్రష్టను దర్శించాము.

'రాజకీయనాయకులతో' నిండిన దేశంలో ఒక 'రాజనీతివేత్త'ను ఇన్నేళ్ళకు చూడగలిగాము. నువ్వు, నేను అనకుండా మనము అన్న నాయకుడిని యిప్పుడే చూస్తున్నాము. నిందలను సుగంధ మందార మాలలుగా మార్చుకునే మనిషిని చూశాము. సగటు భారతీయుడు ఎంత ఎత్తులకు ఎదగగలడో ఋజువు చేసిన ఋషి తుల్యుడిని చూశాము. 

ఎవరికన్నా సందేహం ఉండవచ్చు కానీ, నాకైతే ఏమీ సందేహము లేదు. నరేంద్ర మోడీ ఋషితుల్యుడే! ఊహ తెలిశాకే వివాహం అయ్యింది. కోరికలు గుర్రాల్లాగా పరుగులెత్తే వయసులోనే వివాహం అయ్యింది. ఇంటిని ఇల్లాలినీ వదిలేశాడు. సంఘ సేవకుడిగా దేశసేవకు అంకితమయ్యాడు. శుకుడు, నారదుడు ఇత్యాదులనే ఋషులు అనుకుంటాము. భారత దేశములో ఒక ఋషి తుల్యుడు 1925 లో ఒక ఋషుల బృందాన్ని తయారుజేశాడు. ఆబృందానికిరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్అని పేరుపెట్టాడు. ఋషులవంటి స్వయంసేవకులను దేశసేవలో, సమాజ సేవలో నియోగించాడు. దుష్ప్రచారం ఎంత పనైనా చేస్తుంది నమ్మగలిగినవారి విషయములో.‘ ‘నమస్తే సదావత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్దితోహం..మహా మంగళే పుణ్యభూమే త్వదర్ధే పతత్యేష కాయోం నమస్తే, నమస్తే..( సదా వాత్సల్య భావం ఉన్న తల్లీ! మమ్మల్నందరినీ పుత్రులుగా కలిగిన తల్లీ! మహా మంగళా! మంగళములను ప్రసాదించేతల్లీ! మంగళ గౌరీ! పుణ్యాత్మురాలా, పుణ్యభూమీ! నీకోసం రాలిపోయే తనువులను కలిగిన నీ కుమారుల నమస్సులు తల్లీ!) అని నిత్యమూ ప్రార్ధించుకునే దేశ భక్తులు సంఘసేవకులు!

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కి కులం లేదు, వర్గం లేదు, వర్ణ విచక్షణ లేదు, కేవలం భారత మాత మాత్రమే ఉన్నది! చైతన్య మహాప్రభువు లాగా, భగవద్రామానుజునిలాగా, ఆదిశంకరునిలాగా, వేదవ్యాసునిలా భిన్నత్వములో ఏకత్వాన్ని చూసే పవిత్ర సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్! కాకుంటే పైన చెప్పినవారు భగవంతునిపరముగా పరమాత్ముడొక్కడే, ఆయనను చేరుకొనడానికి భక్తి మాత్రమే అర్హత, కులము, ధనము కాదు అన్నారు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సామాజికంగా దేశం ఒకటే, దేశమాత ఒకతే, మనమందరమూ ఆమె పిల్లలమే, భరతమాతను ప్రేమించేవారందరూ భారతీయులే అంటుంది, ఇందులో జాతీయభావమే తప్ప ధార్మిక/జాతీయ ఉగ్రవాదం ఎక్కడుంది? అలా దేశంకోసం, సమాజంకోసం భారతీయధర్మ రక్షణకోసం పరిశ్రమించే పవిత్రాత్ముల నిలయమైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఒక సామాజిక సేవకుడైన ఋషి అయితే, ఆయన తదనంతరం అధ్యక్షుడైన మహనీయుడు శంకరాచార్య పీఠానికి అధిపతిగా రమ్మని ఆహ్వానింపబడిన ఆధ్యాత్మికతత్త్వవేత్త! ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించిసమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళుఅని సామాజిక సేవకోసం అంకితమైన మహానీయుడు. ఇద్దరి లక్షణాలను, ఆదర్శాలను, పవిత్రతను పుణికి పుచ్చుకున్న ఆదర్శప్రాయుడు నరేంద్రమోడీ, కనుకనే కోట్లాది ప్రజల స్వప్న మందిరానికి, భారత పార్లమెంట్ కి శిరసు వంచి, నేలకు నుదురు తాకించి ప్రణమిల్లాడు, క్షోణితలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు..అని చదువుల తల్లికి పోతన నుదురు సోకగా వినయంగా మ్రొక్కి భక్తితో కీర్తించినట్లు! 

భారతమాతా! ఇన్నేళ్ళకి మరొక నరేంద్రుడికి జన్మనిచ్చావు తల్లీ, నరేంద్రుడి గురించి మేము వినడమే, చదవడమే కానీ, నరేంద్రుడిని కనులారా చూసి, పరిశీలించి అనుసరించే అదృష్టం కలిగించావు, ధన్యవాదాలమ్మా! వేదాంతపరంగా, ఆధ్యాత్మికంగా భారతదేశ కీర్తిప్రతిష్టలను, ఔన్నత్యాన్ని ప్రపంచానికి ప్రస్ఫుటం చేయడానికి నరేంద్రుడు జన్మించాడు, సామాజికంగా, నైతికంగా, శక్తియుక్తుల పరంగా, ప్రపంచానికి దిశానిర్దేశం చేయగలిగిన ప్రచండశక్తిగా భరతమాత శక్తిని ప్రస్ఫుటం చేయడానికి నరేంద్రుడు జన్మించాడు. గుడిశెలలో మ్రగ్గేవాళ్ళకు, జాలర్లకు, అట్టడుగుపేదలకు, అతివలకు విముక్తి వచ్చినప్పుడే భారతం వికాసం చెందుతుందని నరేంద్రుడు అన్నాడు. మన ప్రథమ లక్ష్యం ఆట్టడుగు వర్గంలోని అడుగునబడిన వారికి సుపరిపాలన అందించడం అని నరేంద్రుడు అన్నాడు. నా భారతం పవిత్ర భారతం, నా సోదరుడు అమృతపుత్రుడు అని నరేంద్రుడు అన్నాడు. నా దేశ యువతకు ప్రపంచయువతకు నాయకత్వం వహించే శక్తి ఉంది అని నరేంద్రుడు అన్నాడు. 

ఇంతవరకూ పొట్టలు పెంచడానికి, ప్రజలను ముంచడానికి, అక్రమ చెల్లింపులు, ముడుపులు పొంది వచ్చిన సొమ్ములమూటలను విదేశీ బ్యాంకులలో పాతిపెట్టినవాళ్ళను, దేశగౌరవాన్ని తాకట్టు పెట్టినవాళ్ళను చూశాము, యిప్పుడు పొట్టకూటికోసం పరువుగా టీ పెట్టినవాడిని చూస్తున్నాము అత్యున్నత పదవిలో. తమ తమ పార్టీ ఆఫీసులను ఏనాడూ చూసి ఎరుగని విదేశీ భావజాల మత్తులో మునిగి తేలినవాళ్ళను పార్టీలనాయకులు కావడం చూశాము యింతవరకూ, తను నమ్మిన సిద్ధాంతాలకు పుట్టినిల్లయిన పార్టీ ఆఫీసును ఊడ్చినవాడిని, పార్టీ తనకు తల్లివంటిది అన్నవాడిని, అమ్మకు సేవ జేయడం ఎంతగా నా బాధ్యతగా భావిస్తానో, అమ్మవంటి పార్టీని సేవించడం అంతే కర్తవ్యంగా భావిస్తాను అన్న అసలైన కార్యకర్తను ఈనాడు చూశాము. 

నిన్నటిదాకా భ్రష్టు పట్టించి మాకు ఖాళీ బొక్కసాన్ని మిగిల్చారు, యిప్పుడు ఎలా నెగ్గుకురావాలి అనకుండా, ఇప్పటివరకూ అధికారంలో ఉన్న అందరూ తమవంతు సేవ జేశారు, యిప్పుడు మన వంతు వచ్చింది, మనమూ మనవంతు సేవజేసి మన ముద్రను వేయాల్సిన సమయం వచ్చింది, రోజుకు పదహారు గంటలు నేను పనిజేస్తాను, మీరూ చేస్తారా, మీకు చేతనవుతుందా అని మంత్రివర్గ సహచరులను తొలి నాడే ప్రశ్నించిన, పెద్దరికాన్ని హుందాగా ప్రదర్శించిన కర్తవ్య కంకణబధ్దుడిని, ఆశయ నిబద్ధుడిని బహుశా ప్రథమంగా చూశాము. ప్రజాప్రతినిధులు ప్రజా సంక్షేమ కార్య నిర్వహణాధికారులు అని కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన అనిర్వచనీయమైన పరిశ్రమైకజీవన సౌందర్యాన్ని చూశాము. వందరోజుల టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని వెలికితీసే వెలుతురువైపు దారితీసిన తొలి అడుగులసడి విననే విన్నాము. ప్రతిపక్షులారా! నిర్దయగా ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పిజేసిన గండభేరుండ పక్షులారా! వెక్కిళ్ళు పడడం, వెక్కి వెక్కి ఏడవడం మీ వంతు, వెనక్కు తిరిగి చూడకుండా వెలుగులవైపు పయనించడమే తన తంతు!

ప్రథాన మంత్రి ఒక పెన్నును బహూకరిస్తే కానుకను అపురూపంగా గుండెలకు హత్తుకుని ఆనంద బాష్పాలు రాల్చింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, నాలుగుసార్లు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిజేసిన వాడి అన్నదమ్ములు నీల్ కమలో, రాజ్ కమలో, ప్లాస్టిక్ కుర్చీలు రెండు మూడు పెట్టుకున్నారు వాళ్ళ డ్రాయింగ్ రూమ్ లో, ఎన్నికల యుద్ధంలో గెలిచి ఢిల్లీకి రాజైన కొడుకు తన ఆశీస్సులు కోరివస్తే, నెత్తిన చెయ్యెట్టి నిమిరి, కొంగున దాచుకున్న నూటొక్క రూపాయలను ఒక ముసలి తల్లి బహుమతిగా ఇస్తే కోట్ల సంపదను పొందినవాడిలా మురిశాడొక ముద్దులకొడుకు, ఇంకెక్కడ ఇంత నిరాడంబరులను, మేరునగ గంభీరులను చూస్తాం, కొల్లాయి కట్టి, చేత కర్రనొకటి పట్టి, తెల్లదొరతనాన్ని పెళ్ళగించిన కోమటీడు పుట్టిన గుజరాతులోనే! త్రుణాదపి సునీచేన తరోరివ సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయ సదా హరిః ( గడ్డి పరకల్లాగా అణిగి మణిగి ఉండాలి, తరువుల్లాగా సహనంతో మెలగాలి, మానావమానాల అహంకార పూర్వక ద్వంద్వాన్ని విడిచి హరి సేవ జేయాలి) అనే పలుకులు నాకు గుర్తొస్తున్నాయి, దేవాదిదేవుడైన శ్రీహరి రూపక దరిద్ర నారాయణుల సేవకు దర్పములేని నాయకుడొకడు దయచేస్తున్నాడు, హృదయపూర్వక స్వాగతం! 

గుజరాతు పుణ్య భూమీ! నీ కుమారుడే ఒకడు మాకు తెల్లవాళ్ళనుండి విముక్తిని ప్రసాదించాడు, మరొకడు నీ కుమారుడే ముక్కలు చెక్కలైన దేశాన్ని ఉక్కు ముక్కలాంటి ధృఢసంకల్పంతో ఒక్కటిగా చేశాడు, నీ కుమారుడే ఇంకొకడు నేడు నల్లదొరల సంకెళ్ళనుండి విడిపించి చల్లని సుఖతీరాలకు మమ్ము నడిపిస్తానంటున్నాడు, అమ్మా! నువ్వు వర్ధిల్లిదువు గాక! నీ కుమారులు జయింతురుగాక!

సంఘసేవకుడిగా తన సర్వజనసేవాసర్వస్వమైన జీవనం పావనం అయ్యిందో, సంఘాన్నే అవసరమైతే రూపుమాపుతానన్న సర్దార్ పటేల్ దీక్షా దక్షతలను నాయకత్వ పటిమను ప్రపంచానికి చాటి చెప్పడానికి వెనుకాడని విచక్షణా జ్ఞానం, శత్రుత్వాన్నే తప్ప శత్రువులను అసహ్యించుకొనని చాణుక్య నీతి, విమర్శలను విలువైన ఆయుధాలుగా మలుచుకునే లౌక్యం, లక్ష్యశుద్ధి కలిగిన నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత యువసింహగర్జనలు దిక్కులు పిక్కటిల్లేలా మారుమ్రోగే రోజులు ఇంకెంతో దూరంలో లేవు. అవినీతి, లంచగొండితనం, నిరుద్యోగం, అసమానతలు, అభద్రత, అలసత్వం లేని నవభారతం ఉదయించడానికి ఉద్యమించే ఆశల సూరీడి వేడి, వీర శివాజీ పిడిబాకు వాడి కలిస్తే పేరు నరేంద్ర మోడీ! తానొక కొండ, పొట్టేళ్ళా తనతో ఢీ ?


Written by
Vanam Venkata VaraPrasadarao
LIC D.O, Madhira

+91 9866805165