Saturday, September 5, 2026

సావిత్రి బాయి ఖనోల్కర్ (యువాన్ డి మార్స్) - Creator of India's 2nd Highest Award

 జూలై 20 ,1913 న స్విట్జర్లాండ్ లో న్యూ కజిల్ లో హంగరీ కి చెందిన, జెనీవా యునివర్సిటీలో సోషయాలజీలో ప్రొఫెసర్ ఐన ఆండ్రీ డి మాడే కీ, రష్యా కి చెందిన మార్త హేనత్జ్లేట్ కి జన్మించిన యువాన్ డి మార్స్ అనంతర కాలంలో భారతీయ మహిళగా తన జీవితం ప్రారంభించి యుద్ధ రంగంలో సాటిలేని ధైర్య సాహసాలు చూపించిన భారతీయ సైనికులకు ఇచ్చే పరమవీరచక్రం ను రూపొందించింది!

 

1929 లో బ్రిటిష్ ఇండియా లో యువ సైన్యాధికారుల బృందంలో తమ శిక్షణలో శెలవులలో విహారానికి వెళ్ళిన విక్రం ఖనోల్కర్ అనేయువ సైన్యాధికారి తో పరిచయం ప్రేమగా మారి, ఉత్తర ప్రత్యుత్తరాల పరంపర తర్వాత ఒక రోజు అకస్మాత్తుగా బొంబాయి లో విమానందిగి నన్ను కలుసుకొమ్మని కబురంపేదాకా వెళ్ళింది. తన తండ్రి మొదలు అభ్యంతర పెట్టినా ఆమె ప్రేమ గెలిచింది, తండ్రిని ఒప్పించింది.

 

ఆవిడ తల్లి ఆవిడ బాల్యంలోనే మరణించింది.బాల్యం అంతా తల్లి లేని లోతుతో, భారతీయ వేదాంత, దార్శనిక,మత గ్రందాల పఠనంలో, కవితలలో, ప్రకృతి సౌందర్యంలో గడిపిన ఆమె పద్నాలుగేళ్ళ ప్రాయంలోనే తనకు పరిచయం ఐనా భారతీయ హైందవ సైన్యాధికారిని ప్రేమించి..సముద్రాలూ దాటి భారత దేశానికి వచ్చి,భారత దేశానికి తనను అర్పించుకొంది.వివాహం ఐనా వెంటనే కట్టూ,బొట్టూ, భాష, వేషం ..అన్నీ భారతీయ మహిళల లాగానే చేసింది.1932 లో వివాహం చేసుకున్న తర్వాత తన పేరును సావిత్రి బాయి గా మార్చుకుంది. సైన్యాధికారుల కుటుంబాల సమావేశాలలో ఆవిడకు భారతీయ పురాణాలమీద, సంస్కృతి మీద వున్న ప్రేమను,అవగాహననూ గమనించిన భారత ఉన్నత సైన్యాధికారి మేజర్ జనరల్ హిరా లాల్ అటల్ అప్పటివరకూ వున్నవిక్టోరియా క్రాస్ బదులుగా స్వతంత్ర భారత సైనికుల కొరకు ఒక ప్రత్యేకమైన పతాకాన్ని రూపొందించే బాధ్యతను ఆమెకు అప్పగించాడు.

 

తనను ఎవరైనా విదేశీ మహిళా అంటే ఆమె వాళ్ళను దులిపి పరేశేది. హిందీ, మరాఠీ,సంస్కృతంలో ధారాళంగా మాట్లాడేది. నేను పొరపాటుగా యూరప్లో జన్మించాను..పూర్వ జన్మలో నేను భారతీయురలినే అనేది. తనకున్న భారతీయ పౌరాణిక, ఆధ్యాత్మిక జ్ఞానం సహాయంతో..దేవతల సహాయార్ధం తన శరీరాన్ని త్యాగం చేసిన మహానుభావుడైన దధీచి మహర్షి వెన్నెముక స్ఫూర్తితో, వజ్రాయుధాలు నాలుగు మధ్యలో అశోక చక్రంలోని మూడు సింహాల భారత ప్రభుత్వ చిహ్నం ఉండేట్లుగా వెనుక ప్రక్క రెండు పద్మములు మధ్యలో మూడు సింహాలు ఉండేట్లుగా 3 .49 సె.మీ. వ్యాసము తో,కాంస్యంతో, నమూనాను రూపొందించి అద్భుతమైన పతకాన్ని తయారు జేసింది సావిత్రిబాయి ఖనోల్కర్.15 -8 -1947 నుండి అమలులో ఉండేట్లుగా,26 -01 -1950 నాడు పరమ వీర చక్రాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. యుద్ధరంగంలో అసమాన ధైర్యశౌర్యాలను ప్రదర్శించిన భారతీయ సైనికులకు ఈ పురస్కారమే అత్యన్నతమైన పురస్కారం. భారత రత్న పురస్కారం తర్వాత భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం. దీని తర్వాత శాంతి సామరస్యాల స్థాపనలో ఇచ్చే అశోక చక్రం ఉన్నతమైనది. మరణానంతరం కూడా పరమవీర చక్ర పతకాన్ని ఇవ్వవచ్చు. ఇంతవరకూ 21 మందికి పరమవీర చక్ర అవార్డునిచ్చారు..వారిలో 14 మందికి మరణానంతరంఇస్తే ఏడుగురికి సజీవులకిచ్చారు. ఒక ఆశ్చర్యకరమైన, గుండెలు బరువేక్కే సత్యం ఏమిటంటే మొదటి పరమ వీర చక్రం ను పొందిన మేజర్సోమ నాధ శర్మ సావిత్రీ బాయి ఖనోల్కర్ కుమార్తెకు స్వయానా మరిది కావడం (భర్త సోదరుడు-3 -11 -1947 నాడు కాశ్మీర్ లో భారత-పాకిస్తాన్ యుద్ధంలో అసమాన ధైర్యాన్ని ప్రదర్శించి అమరుడైనాడు!)

 

అనురాగాలకూ, అనుబంధాలకూ, అతివలు ఎగుర గలిగిన ఎత్తులకూ..దేశ, ప్రాంత,భాషలు అడ్డురావనీ, భారతీయ సంస్కృతీ,సంప్రదాయాలకూ,విలువలకూ సాటి లేదనీ నిరూపించిన భారతీయుల ముద్దుల కోడలు..జన్మ రీత్యా విదేశీ మహిళ ఐన సావిత్రి బాయి ఖనోల్కర్..తన భర్త మరణించిన తర్వాత రామకృష్ణ మిషన్ లో చేరి సమాజ సేవ, ధార్మిక సేవ జేస్తూ..1990 లోభౌతికంగా మరణించినా, ఆమె స్మృతులు.. అజేయులు, అమరులు ఐన భారతీయ సైనికులబూట్ల చప్పుడూ, మరతుపాకుల,పెను ఫిరంగుల గుండ్ల చప్పుళ్ళూ, దేశంకోసం తమ పుత్రులనూ, పతులనూ, సోదరులనూ కోల్పోయినా..జై జవాన్!భారత్ మాతా కీ జై !..అని నినదిస్తున్న వేల భారతీయ మహిళల గుండెల చప్పుళ్ళూ ఉన్నంత కాలం..ఆ ధ్వనులలో ప్రతిధ్వనిస్తూనే వుంటాయి!

No comments:

Post a Comment